Friday, March 4, 2011

ఎండమావి వంటి నగదు బదలాయింపులు

నగదు బదలాయింపు పథకాల ఉద్దేశమేమంటే, పేదలకు డబ్బు ఇచ్చి దానితో ఏమైనా చేసుకునే స్వేచ్ఛను కల్పించటం. ఇకపోతే ఈ నగదు బదలాయింపు ఎవరికి చెందుతుంది? ఎంత మొత్తాన్ని పొందుతారు? ఒకవేళ అందరికీ ఈ బదలాయింపు వర్తిస్తుందంటే, అప్పుడు పరిసరాల్లో డబ్బు పుష్కలంగా ఉంటుంది. అలాకాక, ఎంపిక చేసినవారికే ఇచ్చేటట్లయితే ఎప్పుడూ ఉండే సమస్యలు తలెత్తుతాయి. అంటే, అర్హులైన వారిని అన్యాయంగా తొలగించటం, అనర్హులకు ఇవ్వటం, పెద్దయెత్తున జరిగే పాలనావ్యయం వగైరాలు ఉంటాయి.
అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాల్లోనూ, పేదరికం తగ్గింపు వ్యూహంలోనూ ఇటీవలి కాలంలో నగదు బదలాయింపులు వేలంవెర్రిగా మారాయి. ప్రస్తుతం భారతదేశంలోని విధాన నిర్ణేతలు దీన్ని అనుకరించడంలో తలమునకలయ్యారు. ప్రభుత్వ ఆర్థిక సర్వే 2010-11 ఇందుకు సంబంధించిన ఆలోచనలను ముందుకు తెచ్చింది. వస్తువులపై ఇచ్చే కొన్ని సబ్సిడీల స్థానంలో నగదు బదలాయింపులను చేర్చాలంటూ తన బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి స్పష్టంగా చెప్పారు. అసలు ఈ వ్యూహం ఏమిటి? ఇటీవలి అంతర్జాతీయ అనుభవాన్ని బట్టి నగదు బదలాయింపు అనేది షరతులతో కూడినది (నిర్దిష్టమైన డిమాండ్లను నెరవేర్చుకునేందుకై కుటుంబాలకు ఇచ్చేది) లేదా షరతులు లేనిది. ఎంపిక చేసిన వారికి (నిర్దిష్టమైన ప్రమాణాలను కలిగిన కుటుంబాలకు లేదా వ్యక్తులకు) లేదా సార్వత్రికంగా వర్తించేది. వస్తువులను, సేవలను అందచేయటానికి బదులు ప్రజలకు ప్రభుత్వం నగదును బదలాయిస్తుంది.
నగదు బదలాయింపు చాలా సులువైనది, పసిపిల్లలకు సైతం అర్థమయ్యేదిగా వుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు ప్రజలు పేదలుగా ఎందుకున్నారు? ఎందుకంటే వారిదగ్గర డబ్బులేదు. కాబట్టి వారికి డబ్బు ఇద్దాము. అలాచేస్తే, వారింకెంతమాత్రం పేదలుగా ఉండరు! నగదు బదలాయింపు ప్రతిపాదకులు ఇదేదో విప్లవాత్మకమైన సరికొత్త భావనగా చెబుతున్నారు. నిజానికి, దీనికి చాలా చరిత్రే ఉన్నది. పేదలకు చెల్లింపులు చేసేందుకు వీలుగా ధనికుల నుంచి శిస్తుల రూపంలో వసూళ్ళు చేయాలని కౌటిల్యుని అర్థ శాస్త్రం చెపుతున్నది. విపత్తుల సమయంలో ధన సహాయాన్ని అందించడమే కాదు, తననుతాను పోషించుకోలేని పేదలకు కూడా సహాయం చేయాలని కౌటిల్యుడు చెప్తాడు. మధ్య యుగాల్లో ముస్లిం పాలకులు జకత్‌ పద్ధతిని ప్రవేశపెట్టారు. పేదలకు, వృద్ధులకు, అనాథలకూ, వితంతువులకూ, వికలాంగులకూ రాజ్య ధనాగారం నుంచి సహాయం లభించేది. ఇంకా ఇటువంటివే చారిత్రికాధారాలు కావలసినన్ని ఉన్నాయి.
నగదు బదలాయింపు పథకాల ఉద్దేశమేమంటే, పేదలకు డబ్బు ఇచ్చి దానితో ఏమైనా చేసుకునే స్వేచ్ఛను కల్పించటం. ఇకపోతే ఈ నగదు బదలాయింపు ఎవరికి చెందుతుంది? ఎంత మొత్తాన్ని పొందుతారు? ఒకవేళ అందరికీ ఈ బదలాయింపు వర్తిస్తుందంటే, అప్పుడు పరిసరాల్లో డబ్బు పుష్కలంగా ఉంటుంది. అలాకాక, ఎంపిక చేసినవారికే ఇచ్చేటట్లయితే ఎప్పుడూ ఉండే సమస్యలు తలెత్తుతాయి. అంటే, అర్హులైన వారిని అన్యాయంగా తొలగించటం, అనర్హులకు ఇవ్వటం, పెద్దయెత్తున జరిగే పాలనావ్యయం వగైరాలు ఉంటాయి. ఈ బదలాయింపులను సమర్థంగా నిర్వహించగలమన్న కచ్చితమైన హామీ ఉన్నట్లయితే వీటిని బదలాయించటం సాపేక్షకంగా తేలికగా ఉంటుంది. ఈ నగదు బదలాయింపులు కుటుంబ ఆదాయాలను ప్రభావితం చేస్తాయి. దీనితో, ప్రజావ్యయం పెరుగుతుంది. ఇది ఏరకమైన వ్యయమనేది ఇక్కడ ఎదురయ్యే ప్రశ్న.
మనకు బాగా తెలిసిన పలు విజయగాథలు ఎంపిక చేసిన వారికి వర్తించేవి, షరతులతో కూడినవి. బ్రెజిల్‌లో బోల్సా ఫామిలియా పథకం అమలులో ఉన్నది. ఇక్కడి ప్రభుత్వం ఇచ్చే నగదు నెల ఆదాయం కన్నా తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల మీద ఆధారపడినవారై ఉండాలి. అలానే పాఠశాల హాజరు 85 శాతంగా ఉండాలి. మెక్సికోలో ఒపోర్టునిడాడిస్‌ అనే నగదు బదలాయింపు పథకం అమలులో ఉన్నది. ఇది చాలా షరతులతో కూడుకున్న క్లిష్టమైన పథకం. వయసు, లింగం, కుటుంబంలోని ప్రతి సభ్యుని విద్యాస్థాయి, విద్యుత్‌, కొళాయి సౌకర్యాలు, కుటుంబ ఆస్తులు వగైరాలు చూస్తారు. కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లులు సమావేశాలకు హాజరవుతూ, 'స్వచ్ఛంద' సామాజిక శ్రమలో పాల్గొనాలి.
పురోభివృద్ధి స్వభావం కలిగిన పునఃపంపిణీ బదలాయింపులు వాంఛనీయమనటంలో సందేహం లేదు. నిజానికి పునఃపంపిణీ అనేది ఏ ఆర్థికవ్యవస్థలోనైనా విస్తృతమైనదీ, సంక్లిష్టమైనదీ అని చెప్పవచ్చు. పేదలకు కనీస ఆదాయాన్ని ఒనగూర్చే పథకాలు, వయోవృద్ధులకు పింఛన్లు, బాలబాలికలకు ప్రయోజనాన్ని చేకూర్చే కార్యక్రమాలు, నిరుద్యోగ భృతి ఇతర సామాజిక భద్రతా పథకాలు వంటివి ఏ నాగరిక సమాజంలోనైనా కోరుకోదగినవే. పేద దేశాలు కూడా అనుసరించదగినవే. స్వల్పకాలంలో ఇవి సానుకూల ఫలితాలను ఇస్తాయి. దీర్ఘకాలంలో ఆరోగ్యకరమైన, విద్యాధిక, సురక్షిత జనాభా తయారవుతుంది.
కనుక, ఇక్కడ ఎదురయ్యే ప్రశ్న ఏమంటే, మొత్తం మీద నగదు బదలాయింపు పథకాన్ని వ్యతిరేకించటమా లేదా అన్నది కాదు. మొత్తం అభివృద్ధి వ్యూహంలో, పేదరికం తగ్గింపులో వాటికున్న నిర్దిష్ట ప్రాధాన్యత ఏమిటన్నదే. నగదు బదలాయింపులనేవి నిత్యావసర సరకుల, సేవల స్థానాన్ని భర్తీ చేయలేవు. కాకుంటే వాటికి సహాయకారిగా ఉంటాయి. కాని, ఈ బదలాయింపులనేవి ప్రభుత్వం అందించవలసిన సేవలను తగ్గిస్తాయని, డబ్బును బదలాయించటం ప్రభుత్వానికి సులభమని చెప్పుకొస్తున్నారు. పేదలకు ప్రభుత్వం నగదు బదలాయింపు చేసినట్లయితే, ప్రభుత్వం ఇచ్చేవాటి కోసం చూడకుండా ప్రైవేటు మార్కెట్ల ఉత్పత్తుల్లో తాము కోరుకున్న వస్తువులు, సేవలు వారికి అందుబాటులోకి వస్తాయన్న వాదన పలు దేశాలలో వినపడుతున్నది. ఈతరహా వాదనలో ఒక అంశం మరుగున పడుతున్నది. ఉదాహరణకు బ్రెజిల్‌లో అమలవుతున్న బోల్సా ఫామిలియా పథకం పిల్లల పాఠశాల కనీస హాజరుపై ఆధారపడి ఉన్నది. దీనికి కారణం పేద కుటుంబాల పిల్లలు హాజరు కావటానికి వీలైన నాణ్యత కలిగిన ప్రభుత్వ పాఠశాలలు ఇక్కడ తగినంత సంఖ్యలో ఉండటమే. అంటే, నాణ్యమైన పాఠశాలలపైనా, ఉపాధ్యాయ విద్యపైనా ప్రభుత్వ పెట్టుబడులు కొనసాగుతున్నాయన్న మాట. ప్రజలకు అందజేసే కొద్దిపాటి మొత్తాలు స్థానికంగా ఉండే సాధారణ వైద్యులను సంప్రతించటానికి పనికొస్తాయేగాని అన్ని సౌకర్యాలున్న ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లేందుకు ఉపయోగపడవు. నిత్యావసర సరకుల ధరలు పెరుగుతున్న సమయంలో నగదు బదలాయింపువల్ల పెద్దగా ఫలితం ఉండదు.
పలు వర్ధమాన దేశాలలో కేవలం నాణ్యమైన విద్యను అందించే పాఠశాలలనే కాక ఇంకా అనేకమైన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. బడికి పిల్లలను పంపిన తల్లి దండ్రులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. రహదారులు, ఆరోగ్య కేంద్రాలు, విద్యుత్‌, కొళాయి నీరు, పాఠశాలలు, విమానాశ్రయం లేదా పలు రైల్వే స్టేషన్లు వంటి మౌలిక వసతుల గురించి పట్టించుకోవడం లేదు. ఆహారంతోసహా వివిధ రకాలవాటిని పంపిణీ చేయటానికి బదులు నగదు బదలాయింపు పథకాన్ని తీసుకు రావాలన్నదే యుపిఏ ప్రభుత్వ ఎజెండా అన్నది స్పషమవుతున్నది. కిరోసిన్‌, ఎరువులకు సబ్సిడీలను ఎత్తివేసి వాటి స్థానంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు నేరుగా నగదు బదలాయించే పద్ధతిని ప్రవేశపెట్టాలని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రతిపాదించాడు. ఆయన తన ప్రసంగంలో ఈవిధంగా చెప్పాడు. ''మరీముఖ్యంగా ఇంధనం, ఆహార ధాన్యాలపై ప్రభుత్వం సబ్సిడీలను అందచేస్తున్నది. ముఖ్యమైన ఈ అవసరాలు సాధారణ ప్రజలకు అందుబాటు ధరలలో లభించేలా చేయటమే ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఇంధనంపై ఇచ్చే సబ్సిడీలో అధిక భాగం నిజమైన లబ్ధిదారులకు అందటం లేదు. సబ్సిడీపై కిరోసిన్‌లో అత్యధిక భాగం దారిమళ్ళుతున్నది......కిరోసిన్‌, ఎరువుల సబ్సిడీలు కచ్చితంగా ఉపయోగపడేలా చూసేందుకు దారిద్య్ర రేఖకు దిగువన వున్న వారికి దశల వారీగా నగదు బదలాయింపు పథకాన్ని వర్తింప చేస్తాము'', అని ఆయన చెప్పారు. ఈ వైఖరి వల్ల తక్షణమే ఎదురయ్యే రెండు సమస్యలున్నాయి. ఒకటి, కొత్తగా నియంత్రణలు ఎత్తివేయనున్న నిత్యావసర వస్తువుల మార్కెట్లలో పెరిగే ధరలకు అనుగుణంగా ఈ నగదు పంపిణీ పంపకం ఉంటుందా? రెండవదేమంటే, కిరోసిన్‌, ఎరువులను సబ్సిడీపై పొందే లబ్ధ్దిదారులకే నగదు అందుతుందని ప్రభుత్వం ఎలా చెప్పగలదు? ఈ రెండవ సమస్య భారతదేశంలో అందరికీ తెలిసిందే. ప్రజాపంపిణీ వ్యవస్థ విధానంలో దారిమళ్ళడం సాధారణంగా జరుగుతున్నది. వస్తువులను దారిమళ్ళించి వాటిని నిల్వచేయడం లేదా అమ్మటంకన్నా నగదును దారి మళ్ళించడం ఎంత సులభం?
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే నగదు పంపిణీలో తలెత్తే సమస్యలను తొలగించవచ్చునని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే పేదలెవరు? నగదు అందుకోవలసిన రైతులెవరు? అన్న విషయాలను సాంకేతిక విజ్ఞానంతోకాక సామాజిక రాజకీయ అంశాలతో నిర్ణయించాల్సి ఉంటుంది. మార్కెట్లపై నియంత్రణలను ఎత్తివేస్తే అవి అందుబాటులో ఉంటాయన్న నమ్మకం లేదు. నిత్యావసర సరకుల పంపిణీకన్నా నగదు బదలాయింపు పథకం ఏమాత్రం మెరుగైనది కాదు.

No comments:

Post a Comment