Friday, April 22, 2011

అంత్య దశలో బాబా అనుమానాల ఆశ్రమం

నెల రోజులుగా అనారోగ్యంతో బాధడుతున్న సత్య సాయిబాబా పరిస్థితి తీవ్రంగా విషమించింది. ఆయన శరీరావయవాలన్నీ పనిచేయడం మానేశాయనీ, చికిత్సకు కూడా స్పందించడం లేదనీ వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా సాయిబాబా గురించీ, ఆయన నిర్మించిన సామ్రాజ్యం, దాన్ని నిర్వహిస్తున్న ట్రస్టు గురించీ మీడియాలో వస్తున్న వార్తా కథనాలు ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బాబా ఆరోగ్యం గురించీ, ఆయన అనారోగ్యంపాలైన తరువాత ఆశ్రమంలో జరుగుతున్న వ్యవహారాల గురించీ వాస్తవాలు వెల్లడి కాకుండా నిర్వాహకులు ఎంతగా ప్రయత్నిస్తుంటే అంతగా ప్రజల్లో అనుమానాలు బలపడుతున్నాయి. బాబాకు దైవత్వం ఆపాదించి, ఆయన చుట్టూ నిర్మించిన సుమారు 1.30 లక్షల కోట్ల రూపాయల (మన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ కన్నా ఎక్కువ) ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎవరు ఏలాలన్న దానిపై ట్రస్టు సభ్యుల మధ్య యుద్ధం సాగుతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాబా-బందీ పేరుతో ఆంధ్ర జ్యోతి పత్రికలో దిగ్భ్రాంతికరమైన అనేక విషయాలు వచ్చాయి. సాయిబాబా ఆశ్రమానికి అతి సన్నిహితులైన అనేక మంది అక్కడ జరుగుతున్న అక్రమాలపై ప్రకటనలు చేస్తున్నారు. పుట్టపర్తి ఆశ్రమం ఒక మినీ స్విస్‌ బ్యాంకు మాదిరిగా నల్లడబ్బుకూ, అక్రమార్జనా పరుల సంపాదన దాచుకోడానికీ కేంద్రంగా మారిందని పత్రిక రాసింది. మంత్రులూ, బడా బాబులూ తమ అక్రమ సంపాదనలో పెద్ద మొత్తాలు పుట్టపర్తిలో దాచుకున్నారనీ, బాబా ఆరోగ్యం విషమిస్తుండడంతో 'దీపముండగానే ఇల్లు చక్కబెట్టు'కునే చందంగా వారంతా తమతమ సొమ్ములను ఇతర ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారని, ఆన్‌లైన్‌లో కూడా ఎడతెరిపిలేకుండా డబ్బు విదేశాలకు బదిలీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. బాబా ఆశ్రమంలో పేరుకుపోయిన బంగారం, విలువైన వజ్రాలూ, నగలూ వగైరాలను ట్రక్కుల్లో రహస్యంగా బెంగుళూరు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అన్నిటికీ మించి సాయిబాబాను ట్రస్టులోని కొంతమంది సభ్యులు బందీలుగా చేశారనీ, ఆయనకు నిద్ర మాత్రలు ఇస్తున్నారనీ, సరైన మందులు, ఆహారం అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనీ రాశారు. ఇంకా ఘోరంగా ఆయన శరీరంపై దెబ్బల గుర్తులు ఉన్నాయనీ, ఆయనను మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా వేధించి ఉంటారని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
నెల రోజులుగా సాయిబాబా గురించీ, ఆయన సామ్రాజ్యంలో జరుగుతున్న చీకటి వ్యవహారాలగురించీ ఇన్నిన్ని వార్తలొస్తూ ఉంటే ట్రస్టు గానీ, ప్రభుత్వం గానీ నోరుమెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వార్తల్లో నిజం లేదా? లేకపోతే లేదని చెప్పొచ్చు. కాని చెప్పరు. పోనీ ఆ వార్తలు అసలు పట్టించుకోదగ్గవి కావా? కాని సాయిబాబా చిన్న వ్యక్తికాదు. ఏదో ఒక మీడియాలో వచ్చే వార్తలను పట్టించుకోనక్కరలేదా? కాని సాయిబాబా ఆంతరంగికుల్లో అనేకమంది ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కాని అది నోరు విప్పడం లేదు. మౌనం వీడడం లేదు. మౌనం అర్థంగీకారం కదా! అంటే ఈ చీకటి వ్యవహారాలతో (కేంద్ర, రాష్ట్ర, కర్నాటక) ప్రభుత్వాల్లో కీలక వ్యక్తులకూ లింకులున్నాయని వస్తున్న వార్తలను నమ్మాలా?
అధికారం, డబ్బు చుట్టూ..
ఒక సామాన్య వ్యక్తికి దైవత్వం ఆపాదించి, భగవత్‌ స్వరూపునిగా ప్రజలను నమ్మించే ప్రయత్నాల వెనుకనున్న కారణాలేమిటో సాయిబాబా చివరి ఘడియల్లో జరుగుతున్న ఈ పరిణామాలు స్పష్టంగా మన ముందుంచుతున్నాయి. ప్రజల్లో చాలాచాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాబా దైవ స్వరూపుడైతే ఆయన చుట్టూ ఈ చీకటి సామ్రాజ్యం ఎలా నిర్మించబడింది? ఆయనకు నల్లడబ్బు, అక్రమ లావాదేవీలతో సంబంధం ఉన్నదా లేదా అన్నది ప్రశ్నకాదు. తన కిందనే ఇంత జరుగుతున్నా ఆయన తెలుసుకోలేదా, లేక తెలిసి ఊరుకున్నారా? తెలుసుకోలేకపోతే ఆయనకూ మామూలు మనుషులకూ తేడా లేదు. తెలిసీ ఊరుకుంటే ఆయన కూడా ఈ అక్రమాలకు బాధ్యుడవుతారు.
సాయిబాబా దేవుడని నమ్మేవారిలో పామరులకన్నా, విద్యాధికులూ, ఉన్నత స్థానాల్లో ఉన్నవారే ఎక్కువ. ఆయనను ఆరాధించేవారిలో ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లే కాదు, దేశాధినేతల నుండి మరత్రులు, కార్పొరేట్‌ అధిపతులు, శాస్త్రవేత్తలు కూడా అనేకమంది ఉన్నారు. తను 'సృష్టించే' విబూదితో ప్రజల అనారోగ్య బాధలను సాయిబాబా తొలగిస్తారని వారి నమ్మకం. కాని బాబా ఆరోగ్యం కాపాడడానికి స్వదేశీ, విదేశీ వైద్యులూ, పరికరాలూ ఎందుకు అవసరమైనాయో వారు చెప్పరు. బాబా విబూది ఆయనకు ఎందుకు పనికిరాలేదో మాట్లాడరు. ఈ ప్రశ్నలన్నీ ముందుకొస్తే జవాబు చెప్పలేక తప్పుకోడానికి సాయిబాబా చేసే సేవలగురించి చెబుతారు. ఆయన కట్టించిన విద్యాలయాలు, వైద్యాలయాలు, ఆయన ట్రస్టు తరఫున జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి చెప్పి అందుకు ఆయనను పూజించాలంటారు.
నిజమే, సాయిబాబా ట్రస్టు తరఫున ప్రజలకు అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్న మాట వాస్తవమే. భక్తులనుండి వసూలు చేసిన డబ్బుతో ఆయన నడుపుతున్న సేవా సంస్థలూ, కార్యక్రమాలూ అనేక మంది పేద ప్రజలకు అనేక విధాలా మేలు చేస్తున్న సంగతీ నిజమే. అందుకు బాబాను వేనోళ్లా కొనియాడాలి. ఆయనను కీర్తించాలి. కాని బాబానే కాదు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న వారు అనేకమంది ఉన్నారు. విరాళాలు సేకరించీ, సేకరించకుండా తమ 'స్వంత' డబ్బుతో కోట్ల రూపాయల సేవాకార్యక్రమాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. సాయిబాబా మాదిరిగా వారంతా కూడా ప్రశంసనీయులే. సమాజ సేవకులే. కాని వాళ్లంతా దేవుళ్లు కానప్పుడు సాయిబాబాను దేవుని చేయడమెందుకు, ఆయన చుట్టూ మహిమలు, మాయలు చేర్చి ప్రజలను మోసగించడమెందుకు?
ఇప్పుడు చూస్తుంటే అనేకమంది మంత్రులూ, అధికారులూ, మహామహులంతా బాబాను నిత్యం దర్శించుకోవడం వెనుక ఆధ్యాత్మికత కన్నా ఆర్థికమే ప్రధానంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బాబా ఆశ్రమం అక్రమ ఆర్థిక లావాదేవీలకే కాకుండా పదోన్నతులు, ప్రజాప్రతినిధులు- కార్పొరేట్‌లు- కాంట్రాక్టర్ల మధ్య రహస్య డీల్‌లకు కేంద్రంగా ఉన్నదని గతంలోనే లోకోక్తిగా చెబుతుండేవారు. నేడు మీడియాలో వస్తున్న వార్తలు ఈ విషయాన్ని రూఢిపరుస్తున్నాయి. ప్రభుత్వం, అధికారుల నేటి మౌనం వెనుక కారణం ఇదేనా? తీగలాగితే డొంక కదులుతుందన్న భయంతో ఎవరికి వారు మిన్నకుండిపోయారా? సమాధానం రావాలి!
మూఢనమ్మకాల వ్యాప్తి
ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే ఇప్పుడు కూడా సాయిబాబా చుట్టూ మూఢనమ్మకాల వాప్తికి అనేక రకాలా ప్రయత్నిస్తున్నారు. బాబా భౌతిక దేహం ముఖ్యం కాదని ట్రస్టు సభ్యుడైన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉవాచ. మరోవైపున బాబా మైనపు విగ్రహం పాదాల్లోంచి గంధం వచ్చిందని మరో ప్రచారం. బాబా ఆరోగ్యం బాగుపడాలని ప్రజలంతా ప్రార్ధనలు చేయాలని ఒక ట్రస్టు సభ్యుడు పిలుపునిచ్చాడు. చాలా మంది ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు. కొంతమంది యజ్ఞయాగాలు చేస్తున్నారు కూడా. ఇవన్నీ ఏమీ పనిచేయవని వీరికి తెలియంది కాదు. కాని ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడు శాస్త్రీయమైన, సహేతుకమైన సమాధానాలు వారికి లభిస్తే మూఢనమ్మకాలకు వారు దూరమైపోతారు. కనుక అటువంటి హేతు దృష్టి వారిలో కలగకుండా పూజలూ, పునస్కారాలవైపు మళ్లింపు. మరి ఈ ఆసుపత్రి చికత్సలూ, డాక్టర్ల ప్రయత్నాలూ ఎందుకనే దానికి సమాధానం చెప్పడు. బాబా దైవత్వం గురించీ, గాలిలోనుండి బంగారు ఆభరణాలు సృష్టించే ఆయన మహిమల గురించీ వల్లించే ఒక పెద్దాయన బాబాకు అన్నం పెట్టకుండా ఆకలికి గురిచేస్తున్నారని చెబుతాడు. తన దగ్గరకు వచ్చేసరికి మహిమలన్నీ ఏమైనాయన్నది ప్రశ్న. పుట్టపర్తిలో వెలసిన సత్తెమ్మ తల్లి విగ్రహాన్ని తొలగించడంవల్లే బాబాకు కష్టాలు వచ్చాయని పెద్ద ప్రచారం చేశారు. ఆ విగ్రహం వెదికి పట్టుకుని తిరిగి ప్రతిష్టించారు. దాంతో బాబా కోలుకుంటారని చెప్పారు. ప్రజల సెంటిమెంటు పేరుతో ఇటువంటి అనేక మూఢనమ్మకాలను పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పుకోవాలి. డబ్బు, అధికారం, కుటుంబ తగాదాలు, అనారోగ్యం, అశాంతి అందరి మనుషుల్లాగే బాబాకూ వచ్చాయి. అందరిలాగే ఆయనకూ కష్టాలూ, నష్టాలు వచ్చాయి. అందువల్ల ఈ సమయంలో ఆయనపట్ల సానుభూతి చూపడం, ఆయన కోలుకోవాలని కోరుకోవడం మానవత్వం ఉన్న మనుషులంతా చేస్తారు. అందులోనూ తన సేవా కార్యక్రమాల ద్వారా అనేక మందికి మేలు చేస్తున్న బాబా శారీరకంగా ఇబ్బందుల్లో పడ్డారంటే బాధపడేవాళ్లు ఎక్కువమంది ఉంటారు. అదే సమయంలో సత్య సాయి ట్రస్టు పేరుతో ఆయన అనుయాయులమని చెప్పుకునే వారు చేస్తున్న అక్రమ లావాదేవీలను ప్రశ్నించకుండా ఉండకూడదు. బాబా చుట్టూ మూఢనమ్మకాలు వ్యాపింపజేయడాన్ని అనుమతించకూడదు................ప్రజాశక్తి పత్రికలో ఎస్. వెంకటరావు గారి వ్యాసం....

Thursday, April 21, 2011

వినాయక్‌ సేన్‌ వంటి ప్రజాస్వామిక వాదిని బెయిలుపై విడుదల చేయడం ఆహ్వానించదగిన పరిణామం.ప్రతి వ్యక్తికి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. ప్రజాస్వామిక సూత్రాలను సుప్రీం తీర్పు మరోసారి బహిర్గతపరిచింది. మావోయిస్టుల అర్థ రహిత హత్యా రాజకీయాలపై కూడా ప్రజాస్వామిక చర్చలు జరగాలి. దేశవ్యాప్తంగా బూటకపు ఎన్‌కౌంటర్ల వార్తలు తరచుగా చూస్తున్నాం. ఇందుకు విరుద్దంగా బెంగాల్లో ఒక్క బూటకపు ఎన్కౌంటర్ర్ లేకపోవడం గమనార్హం. కొన్ని సంవత్సరాలుగా ప. బెంగాల్లో మావోయిస్టుల హత్యా రాజకీయాలు మితిమీరినాఈ. అనేక మందిని హత్య చేసారు. ఉపాధాఇయ్లను కూడా కాల్చి చంపారు. ప్రజాస్వామిక హక్కులను గౌరవించాల్సిన బాధ్యతను మరచి భయోత్పాతం సృష్టించి లబ్ది పొందాలని ఆశిస్తున్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని మమతా మావోయిస్టులకు సంపూర్ణ సహకారం అందిస్తోంది.

Thursday, April 14, 2011

మోడీపై పొగడ్తలా?

- తీవ్ర విస్మయానికి గురయ్యాను: సారాబాయి - నిరసనగా అన్నాహజారేకు లేఖ

అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన అన్నా హజారే గుజరాత్‌ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రశంసిస్తూ ఇటీవల విడుదల చేసిన ప్రకటనపై ప్రముఖ కళాకారిణి, సామాజిక కార్యకర్త మల్లికా సారాబాయి తీవ్ర విస్మయానికి గురయినట్లు పేర్కొన్నారు. అన్నా హజారే దీక్షకు మద్దతుగా అహ్మదాబాద్‌లో ఆందోళనలో పాల్గొన్న మల్లికా సారాబాయి మోడీని పొగడటంపై హజారేకు నిరసన తెలుపుతూ లేఖ రాశారు. గుజరాత్‌ గ్రామాల్లో కొద్దిపాటి అభివృద్ధి కూడా జరగలేదన్నారు. 'మీ పొగడ్తను ఉపసంహరించుకోకపోతే లోక్‌పాల్‌ ఉద్యమానికి మాకు మేము దూరంగా ఉండాల్సి వస్తుంది' ఆమె లేఖలో పేర్కొన్నారు. తన ప్రశంస కేవలం గ్రామీణాభివృద్ధికి సంబంధించి మాత్రమేనని హజారే సారాభాయికి లేఖ రాశారు. 'నరేంద్ర మోడీ నితీష్‌కుమార్‌ గ్రామీణ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి పనులను మాత్రమే నేను ప్రశంసించాను. అదే సమయంలో మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా నేను వ్యతిరేకిస్తాను' అని హజారే సారాబాయికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
తీవ్రంగా బాధపడ్డాం: సామాజిక కార్యకర్తలు
అన్నా హజారే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించినందుకు తీవ్రంగా బాధ పడ్డామని పలువురు సామాజిక కార్యకర్తలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులు, మహిళలు, కార్మికులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, అన్ని అణగారిన వర్గాలకు వ్యతిరేకమైనదని స్పష్టం చేశారు. ఈ మేరకు పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జెఎస్‌ బందుక్వాలా, మానవ హక్కుల సంస్థ డైరెక్టర్‌ ప్రశాంత్‌, ఫాదర్‌ సెడ్రిక్‌ ప్రకాశ్‌, నేషనల్‌ ఫెలో ఆఫ్‌ ది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ (సిమ్లా)కి చెందిన ఘన్‌శ్యాం షా, సామాజిక కార్యకర్తలు రోహిత్‌ ప్రజాపతి, తృప్తి షా, నందిని మంజ్రేకర్‌ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 'ఇండియా అగైన్‌స్ట్‌ కరప్షన్‌' గుజరాత్‌ కన్వీనర్‌ వినోద్‌ పాండ్యా సహా అనేకమంది అన్నా హజారేకు వాస్తవ పరిస్థితి తెలియదని అభిప్రాయపడ్డారు. ఆయన స్వయంగా గుజరాత్‌కు వచ్చి పరిస్థితిని చూడాలన్నారు.ల

లేఖ పూర్తి పాఠం
డియర్‌ అన్నాజీ !
నరేంద్ర మోడీ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధిపై మీరు ప్రశంసలు కురిపించడం మమ్మల్ని తీవ్ర విస్మయానికి గురిచేసింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిపాటి అభివృద్ధి కూడా జరగలేదు. వాస్తవమేమిటంటే సేద్యపు భూములను కూడా రహస్యంగా ప్రభుత్వం తీసుకొని అతి తక్కువ ధరలకు పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టింది. 21 లక్షల మంది రైతులు నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు ఏడేళ్ళ నుండి ఇక్కడ లోకాయుక్తా లేకపోవడంతో అవినీతికి వ్యతిరేకంగా దాఖలైన వందలాది ఫిర్యాదులపై విచారణ నిలిచిపోయింది. సుజలాం సుఫలాం పథకంలో రూ. 1,700 కోట్లు, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌లో 109 కోట్ల కుంభకోణం, మత్స్యశాఖలో 600 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నాయి. ప్రతి శాఖ వేలాది కోట్ల రూపాయల కుంభకోణంలో కూరుకుపోయి ఉంది. మోడీ తన స్నేహితులైన పారిశ్రామికవేత్తలకు పేద, గ్రామీణ ప్రాంత ప్రజలను అమ్మేశారు. పరిశ్రమలపై చూపిన ఉదాసీన వైఖరివల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. మీ పొగడ్త భయంకరమైనది. దీనిని మీరు ఉపసంహరించుకోకపోతే లోక్‌పాల్‌ ఉద్యమానికి మేము బలవంతంగానైనా దూరంగా ఉండాల్సి వస్తుంది'
ఇట్లు
మల్లికా సారాబాయి

అవినీతిపై పోరాటాన్ని మోడీకరణ చేయొద్దు


ఆదివారం హజారే మీడియానుద్దేశించి మాట్లాడుతూ నరేంద్రమోడీని ఆకాశానికెత్తారు. తద్వారా తనంతట తానుగా ఉద్యమ పరిధిని కుదించుకున్నారు. రాజకీయాలకతీతంగా అవినీతి వ్యతిరేకోద్యమం అన్న ఆయన మాటల చిత్తశుద్ధిని ఇది తేటతెల్లం చేసింది. మోడీని ఆయన ఉత్తమ ముఖ్యమంత్రిగా కొనియాడారు. చట్టం వచ్చి ఎనిమిదేండ్లయినా ఇంతవరకు గుజరాత్‌లో లోకాయుక్తను నియమించలేదు. పైగా ఆ చట్టం పరిధిలోకి ముఖ్యమంత్రి రాడు. అదే సమయంలో బెంగాల్‌ లోకాయుక్త పరిధిలోకి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి చరిత్ర సృష్టించింది. దీన్ని బట్టే హజారే అసలు ఉద్దేశాలేమిటో మనకు బోధపడుతుంది.                        ----------------------వి.శ్రీనివాసరావు (ప్రజాశక్తి సౌజన్యం నుండి)

ప్రభుత్వంతో అవగాహన కుదరడంతో అన్నా హజారే దీక్ష విరమించారు. దేశ వ్యాపితంగా ఆనందోత్సాహాలు వెల్తువెత్తినట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇందులో మీడియా క్రియాశీలపాత్ర వహించింది. దీక్ష విరమించగానే ''భారతదేశం జయించింది'' అన్న బ్యానర్‌లతో వార్తలిచ్చాయి. నిన్న ప్రపంచకప్‌..నేడు హజారేదీక్ష..అన్న చందంగా అభివర్ణించాయి. ప్రపంచకప్‌ను శ్రీలంకమీద గెలుచుకున్నాం కాని దీక్ష ఎవరిపై విజయం? ఇందులో భారతదేశం విజేత అయితే ఓడిందెవరు? అవినీతి ఓడిపోయిందా? లేక ప్రభుత్వం ఓడిపోయిందా? అందరూ నీతిపరులే అయితే అవినీతి ఎక్కడుంది? ప్రాస కోసం వార్తలు, విశ్లేషణలు ఇస్తున్నారనుకున్నా ప్రజలకు వాస్తవం తెలియాలి కదా? ఈ ఉద్యమంలో అత్యంత విషాదకర వార్తలు కూడా ఉన్నాయి. ఎవరినైతే అవినీతిపరులుగా మీడియా ఎత్తి చూపిందో వారే నేడు ఈ ఉద్యమానికి మద్దతునీయడంలో అందరికన్నా ముందున్నారు. ఉదాహరణకు కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంబరాలు జరుపుకున్నారు. పలు భూ కుంభకోణాల్లో ఆరోపణలు నిగ్గు తేలినా ఆయన్ను పదవిలో అట్టిపెట్టిన బిజేపీ అవినీతి వ్యతిరేకపోరాట యోధురాలిగా పోజులిస్తోంది. 2జి కుంభకోణానికి ఆదిమూర్తులు బిజేపీవాళ్లేనని ఇప్పుడు రికార్డులు చెపుతున్నాయి. అరుణ్‌శౌరీ మంత్రిగా ఉండగా ఈ చౌకబేరానికి తెర లేపారు. రాజా ఆ వారసత్వాన్ని అంది పుచ్చుకున్నాడంతే. దీక్షకు సోనియాగాంధీ సంఘీభావం తెలియచేస్తూ హజారేకు ఉత్తరం రాశారు. కాంగ్రెసు, బిజేపీలు రెండూ ఉత్తమ పార్టీలే అయితే దేశంలోని సొమ్మంతా వారికి తెలియకుండానే ఎక్కడికి పోతున్నట్లు? ఐపియల్‌ కుంభకోణంలో పదవి నుండి తొలగించబడ్డ లలిత్‌ మోడీ క్రికెట్‌ అభిమానులంతా హజారే బొమ్మ, బ్యానర్లు పెట్టుకొని స్టేడియంలకు రావాల్సిందిగా పిలుపునిచ్చాడు. బడా పారిశ్రామిక సంస్థలు సిఐఐ, ఆసోచామ్‌, ఫిక్కీ ఈ ఉద్యమానికి భుజం కాశాయి. ఆహా! ఎంత బాగుంది. ఈ విజయంలో వీరందరూ భాగస్వాములే అయితే పరాజితులు ప్రజలేనన్నమాట. అవినీతిపరులు, నీతిపరులు ఇద్దరూ ఒకే వైపు ఉండగలరా?

దీక్ష విరమణానంతరం ఆదివారం హజారే మీడియానుద్దేశించి మాట్లాడుతూ నరేంద్రమోడీని ఆకాశానికెత్తారు. తద్వారా తనంతట తానుగా ఉద్యమ పరిధిని కుదించుకున్నారు. రాజకీయాలకతీతంగా అవినీతి వ్యతిరేకోద్యమం అన్న ఆయన మాటల చిత్తశుద్ధిని ఇది తేటతెల్లం చేసింది. మోడీని ఆయన ఉత్తమ ముఖ్యమంత్రిగా కొనియాడారు. చట్టం వచ్చి ఎనిమిదేండ్లయినా ఇంతవరకు గుజరాత్‌లో లోకాయుక్తను నియమించలేదు. పైగా ఆ చట్టం పరిధిలోకి ముఖ్యమంత్రి రాడు. గుజరాత్‌ ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎంత పెద్దఎత్తున అవినీతిసాగుతుందో స్వయానా మోడీ సోదరుడే మీడియాకు చెప్పారు. ఇక ముస్లిం ఊచకోతలకు మోడీ ట్రేడ్‌మార్క్‌గా మారిపోయిన విషయాన్ని గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అదే మరో వైపు బెంగాల్‌ లోకాయుక్త పరిధిలోకి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి చరిత్ర సృష్టించింది. దీన్ని బట్టే హజారే అసలు ఉద్దేశాలేమిటో మనకు బోధపడుతుంది. ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు ప్రజలు ఓట్లను అమ్ముకుంటున్నారని నిందించారు. ఆయనకు ప్రజలపై విశ్వాసం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. అంతేకాదు ఆయనపై ప్రజలకున్న విశ్వాసాన్ని కూడా వమ్ము చేసే మాటలివి. అంతెందుకు. బిల్లు రూపకల్పనలో పాల్గొనే వ్యక్తుల(హజారే టీం) ఆస్తిపాస్తుల వివరాలను బహిరంగంగా ప్రకటిస్తారా అని విలేకరులు అడగ్గా నీళ్లు నమిలారే తప్ప ఎందుకని అక్కడికక్కడే ముందుకు రాలేకపోయారు? జన లోక్‌పాల్‌ బిల్లు తయారు చేయడంలో కర్నాటక లోకాయుక్త ప్రధానపాత్ర పోషించారు. కాని ఆయన తన స్వంత రాష్ట్రంలో ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలొస్తే కనీసం విచారించలేకపోయారు.

అన్నా హజారేకు వాటర్‌ షెడ్ల నిర్మాతగా పేరుంది. 1995-2004 మధ్యలో మన రాష్ట్రంలో వాటర్‌షెడ్లు పెద్దఎత్తున చేపట్టారు. హజారే మన రాష్ట్రానికి వచ్చి పలు సభల్లో పాల్గొని దాన్ని నీటి విప్లవంగా కొనియాడిపోయారు. కానీ ఏం జరిగింది? వేల కోట్ల రూపాయలు గంగపాలయ్యాయి. మహబూబ్‌నగర్‌, ప్రకాశం, ఆదిలాబాద్‌, విజయనగరం లాంటి జిల్లాలు ఇప్పటికీ కరువు కోరల్లో నలుగుతూనే వున్నాయి. వాటర్‌షెడ్ల పేరుతో ప్రాజెక్టులను విస్మరించారు. నాడు ప్రపంచ బ్యాంకు చెప్పింది ఇదే. కానీ ఉపరితల జలాలను భూగర్భ జలాలుగా మార్చడం ద్వారా నీటిపై హక్కు ప్రైవేటు కంపెనీలకు పోయింది. కోకోకోలా, పెప్సీ లాంటి కంపెనీలు ఈరోజు నీళ్ళను పెద్ద వ్యాపారంగా మార్చివేయగలిగినాయి. ఇప్పుడు వాటర్‌షెడ్లు, రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ గురించి ఎవరూ నోరెత్తడం లేదు. అవినీతి నిర్మూలనా కార్యక్రమం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బ్యాంకు కనుసన్నలలోనే సాగుతున్నది. ఇది సత్ఫలితాల నివ్వకపోయినా ప్రజల కోపాగ్నిని చల్లార్చగలదని వారికి తెలుసు.
మీడియా జన లోక్‌పాల్‌ బిల్లుకోసం ఎందుకంత ఆరాటపడుతున్నది? నిజంగా అవినీతిని అరికట్టవచ్చునని నమ్ముతున్నారా? 90శాతం అరికడతామని హజారే చెపుతున్నారు. అలా అయితే ఇప్పటివరకు ఉన్న చట్టాలు ఎందుకు విఫలమయ్యాయి? నేరస్థులను అరికట్టే చట్టాలు కఠినంగా ఉన్నా నేరం ఎందుకు పెరుగుతూనే ఉంది. అవినీతికి రాజమార్గాలెన్ని వున్నాయో వారికీ తెలుసు. ఈ కొత్త వ్యవస్థపై దృష్టి మళ్ళించడానికి ప్రధాన కారణం ఒకటుంది. గత కొంతకాలంగా ఈ వ్యవస్థకు పట్టుకొమ్మలుగా వుండే వివిధ యంత్రాంగాల నిజ స్వరూపం బట్టబయలవుతోంది. రాజకీయ పార్టీలు, నాయకులు, ఉద్యోగస్తులను పక్కన పెట్టినా ఆఖరికి న్యాయ వ్యవస్థ, మీడియాపై కూడా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. అవినీతి వ్యతిరేక సంస్థలే అవినీతిపరుల పాలయ్యాయి. ఉదాహరణకు తాజా సివిసిగా థామస్‌ నియామకం. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడుకోవాలంటే ప్రజలకు విశ్వాసం కల్పించే మరో కొత్త వ్యవస్థ కావాలి. అదే లోక్‌పాల్‌. దాన్ని అవినీతిని నిర్మూలించే రుద్ర కాళికగా చూపెట్టి ప్రజల్లో ఈ వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నం ఇది. కొంతకాలమైనా ప్రజలలో రగులుతున్న అసంతృప్తిని, ఆగ్రహావేశాలను అదుపు చేయవచ్చు. ఈ తాత్విక ఆలోచనల నుంచే ప్రభుత్వం ఎక్కువ సమయం తీసుకోకుండానే హజారే డిమాండ్లను అంగీకరించి సంయుక్త కమిటీని నియమించింది. తద్వారా తాను కూడా అవినీతి నిర్మూలనకు కట్టుబడి వున్నానని నిరూపించుకునే ప్రయత్నం చేసింది.

అవినీతికి కారణాలపై మీడియాలో జరుగుతున్న చర్చల్ని పరిశీలిస్తే ఏనుగు ఏడుగురు గుడ్డివాళ్ల కథ గుర్తుకొస్తుంది. వ్యక్తుల అత్యాశను కారణంగా కొందరు చెపితే, ఎన్నికల వ్యవస్థను కారణంగా మరికొందరు భావించారు. బ్యూరోక్రసీని కొందరు నిందిస్తే, అధికార కేంద్రీకరణను మరికొందరు ఎత్తిచూపారు. రాజకీయనాయకులను, పార్టీలను కొందరు ఘాటుగా విమర్శించారు. కఠినమైన చట్టాలు లేనందునే అవినీతి ప్రబలుతోందని మరికొందరు వాదిస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన పద్దతిలో వారు విశ్లేషణ చేస్తున్నారు. ఎవరి దృక్కోణం ప్రకారం వారి వాదన సరైందనే అనుకుంటున్నారు. వాదనలన్నీ పాక్షికమైనవే. ఇవన్నీ విడివిడిగా వాస్తవాలైనప్పటికీ సమగ్రమైన విశ్లేషణ మాత్రం కాదు. ఉదాహరణకి బ్యూరోక్రసీ వల్లనే అవినీతి పెరిగిందీ అనుకుంటే గత 20 ఏళ్లలో నూతన ఆర్థిక విధానాల తరువాత బ్యూరోక్రసీ ప్రభావం ప్రభుత్వ యంత్రాంగంపై చాలా తగ్గింది. ఆ లెక్క ప్రకారం అవినీతి తగ్గాలి. కానీ ఈ కాలంలో ఇంకా పెరిగింది. శేషన్‌ ఎన్నికల సంస్కరణలతో అంతా బాగవుతుందనుకున్నారు. కాని ఏమైంది? డబ్బు ప్రభావం తగ్గకపోగా పెరిగింది. డబ్బు పెట్టని వామపక్షాల వంటి పార్టీలకు ప్రచారం చేసుకునే అవకాశం లేకుండా కుదించేశాయీ నిబంధనలు. అలాగే వ్యక్తుల అత్యాశ అని అంటున్నారు. ఆశ అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. చదువుకునే వారికి, వ్యవసాయం చేసేవారికి, ఉద్యోగం చేసేవారికి, కూలి వారికి, పారిశ్రామిక వేత్తకు, రాజకీయ నాయకులకు. ఇలా ఆశ లేనటువంటి వారు లేరు. కానీ ఆశ వున్నా కూలివారు, కార్మికులు వీళ్ళెవరూ కూడా ధనికులు కాలేకపోతున్నారు. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు దొరకడం లేదు. కాబట్టి ఆశవల్లే అవినీతి పెరిగిందంటే ప్రతి ఒక్కరూ అవినీతి పరులే కావాలి ఈ దేశంలో. ఆశ వున్నప్పటికీ కూడా దాన్ని ఆచరణలో పెట్టాలంటే అవకాశాలు కూడా ఉండాలి. అలాంటి అవకాశాలు ఈ వ్యవస్థలో ఎక్కడున్నాయనే విషయం మనం పరిశీలించాలి. అన్నిటికి మూలం కోరికలలో వుందని బుద్ధుడు అన్నాడు. ఆ లెక్క ప్రకారం కోరికలను చంపుకోవాలి. అది సాధ్యమవుతుందా. లేదా మనుషుల మనసులు మార్చడానికి దైవప్రార్థనలు చేయాలి. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇప్పించాలి. మనసును అదుపులో పెట్టుకోవడానికి యోగా చేయాలి. ఈ పనులు చేస్తున్నవారు అవినీతికి అతీతంగా ఉన్నారా? అలా కూడా లేరు. పైగా అవినీతికి ఎక్కువ పాల్పడుతున్నవారే ఇటువంటి పనులు చేస్తున్నారని మన కంటికి కనిపిస్తున్నది. కాబట్టి ఆశ వ్యక్తుల యొక్క లక్షణం కాదు.

దీనికి మూలం మరోచోట ఉంది. నిజానికి ఆశ అనేది పెట్టుబడి లక్షణం. ఈ వ్యవస్థలో తన పెట్టుబడిని పదింతలు చేయడానికి అది అర్రులు చాస్తుంది. లాభం తీసుకురాకుంటే అది ఆ రోజు నిద్రపోనివ్వదు. అది నిద్రపోదు. టీవీ స్క్రీన్‌ మీద క్షణక్షణం మారే షేర్‌ మార్కెట్‌ గ్రాఫ్‌ మనుషుల్ని ఉరకలు పెట్టిస్తుంది. పెట్టుబడి చట్టాలను లెక్కచేయదు. సమాజం పట్ల దానికి దయాదాక్షిణ్యాలు వుండవు. లాభం కోసం ఏ పనికైనా తెగబడుతుంది. హత్యలు, దోపిడీలు చేస్తుంది, జైళ్ళు బద్దలు కొడుతుంది. అలాంటి పెట్టుబడికి స్వేచ్ఛను ఇచ్చి దేశం మీదికి వదిలింది ఎవరు? సంస్కరణలకు ముందు పులిని బోనులో పెట్టి, రోజు కొన్ని జంతువులను ప్రభుత్వమే బలి ఇచ్చేది. దాని ఆకలి తీర్చలేకపోయింది. బలిసిపోయినకొద్దీ ఆకలి పెరుగుతోంది. నువ్వు నా ఆకలిని తీర్చలేవు. నీకెందుకు శ్రమ. నన్ను ఒదిలేసేరు..నా మానాన నేను బతుకుతాను. అని పులి చెప్పడంతో బోనులోంచి ఒదిలేసింది ప్రభుత్వం. దానికే సంస్కరణ అని ముద్దుపేరు పెట్టింది. ఇప్పుడది స్వైర విహారం చేస్తోంది. శనివారం హిందుస్తాన్‌ టైమ్స్‌లో ఇచ్చిన మార్కెట్‌ సర్వే ప్రకారం 40% అవినీతి ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వ పెద్దలను ఆడించడానికే వినియోగిస్తున్నారు. 20% అవినీతి కంపెనీల మధ్య సాగుతోంది. కస్టమర్లను ఆకర్షించడానికి మరో 20% అవినీతి ఖర్చవుతోంది. ఉద్యోగులను అదుపుచేయడానికి, పన్నును ఎగవేయడానికి అవినీతిని ఎరగా వేస్తున్నారు. దేశం వేరులో చేరి పీడిస్తున్న ఫైనాన్స్‌ పెట్టుబడిని అదుపు చేయకుండా అవినీతిని అరికడతాం అంటే అది జనాన్ని మోసం చేయడమే అవుతుంది. లేకపోతే లోక్‌పాల్‌ వంటి చట్టాల ద్వారా మహా అయితే కిందిస్థాయి అవినీతిని కొంతవరకు తగ్గించవచ్చు. లేదంటే పాలకవర్గాల మధ్య ఉండే వైరుధ్యాన్ని పరిష్కరించుకోవడానికి ఉపయోగపడవచ్చు. లోక్‌పాల్‌ వచ్చాక పై స్థాయిలో కొత్త మార్గాలను కనిపెడతారు. ఉదాహరణకు కోటి రూపాయలు క్యాష్‌గా ఇచ్చే బదులు, ఒక కంపెనీ లాటరీలో డ్రా తీసుకొని 4 కోట్ల ఖరీదు కలిగిన ఒక కారును బహుమతిగా అందించవచ్చు. ఒక కంపెనీ పెట్టించి దాని షేర్లను అధిక ధరకు కొని లాభం చేకూర్చవచ్చు. విదేశాల్లో చదివే నాయకుల బిడ్డల ఖర్చులన్నీ విదేశీ కంపెనీ భరించవచ్చు. దాన్ని ఎవరు, ఎలా అరికడతారు? రాజ్యాధికారంతో సహా సర్వాధికారాలు అనుభవిస్తున్న ఫైనాన్స్‌ పెట్టుబడి లీలల నుండి ఎవరైనా తప్పించుకోగలరా?

బిల్లు ఆమోదానికి వారు పడుతున్న ఆరాటం చూస్తుంటే లోక్‌పాల్‌ చట్టాన్ని పటిష్టవంతంగా రూపొందించడం కన్నా తాము తయారు చేసిన బిల్లును ఆమోదింపచేసుకోవాలన్న తపనే ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ కమిటీకి వెలుపల అవినీతి వ్యతిరేక పోరాటంపై ఆసక్తి కలిగిన వ్యక్తులు, శక్తులు, సంస్థలు చాల ఉన్నాయి. ఆ విషయాన్ని వారు ముందు గుర్తించాలి. ఉదాహరణకు ప్రఖ్యాతి గాంచిన న్యాయమూర్తి జస్టిస్‌ వి ఆర్‌ కృష్ణయ్యర్‌ వున్నారు. ప్రముఖ జర్నలిస్టు, మెగసేసె అవార్డు గ్రహీత పి.సాయినాధ్‌ వున్నారు. అవినీతి వ్యతిరేకపోరాటంలో వీరు అలుపెరగని యోధులు. బోఫోర్స్‌ మొదలుకొని తాజా వీకీలీక్స్‌ వరకు హిందూ పత్రిక సాగించిన పోరాటం మనకు తెలుసు. అలాగే తెహల్కా మీడియా ద్వారా అనేక అవినీతి కేసులు వెలుగులోకి వచ్చాయి. 2జిలో రాడియా టేపుల్ని బయటపెట్టింది ఓపెన్‌ అనే మ్యాగజైన్‌. అందరినీ కమిటీలో పెట్టుకోలేకపోయినా కనీసం బిల్లు ముసాయిదా తయారైనాక దాన్ని ప్రజల కోసం బహిరంగపరచాలి. అందరి అభిప్రాయాలూ తీసుకోవాలి. కానీ వీరి తొందరపాటు చూస్తుంటే ఏకబిగిన పార్లమెంటులో పెట్టేసి వెంటనే ఆమోదించాలన్నట్లు వుంది. హజారే పెట్టిన ఆగస్టు 15 గడువు బిల్లుపై విశాల మద్దతును కూడగట్టేందుకు, విస్త ృతంగా చర్చ జరిగేందుకు తోడ్పడదు. బిల్లును ఆమోదించాల్సింది పార్లమెంటు. ఆ పార్లమెంటు సభ్యులు ప్రజలెన్నుకొన్న ప్రతినిధులు. వారిలో అధికార పక్షమే కాదు, ప్రతిపక్షం కూడా వుంది. ప్రతిపక్షంలో బిజెపి లాంటి అభివృద్ధి నిరోధక పార్టీయే కాదు, వామపక్షాల్లాంటి అభ్యుదయ శక్తులు వున్నాయి. అవినీతిపరులే కాదు, నీతి నిబద్ధత కలిగిన వ్యక్తులూ వున్నారు. వారు దానిని అధ్యయనం చేసి క్లాజుల వారీగా తమ అభిప్రాయం చెప్పాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం బిల్లు పెట్టగానే చేతులెత్తేసి, బల్లలు చరిచి ఆమోదించే పద్ధతి మంచిది కాదని సెలెక్ట్‌ కమిటీ, స్టాండింగ్‌ కమిటీ, కన్సల్టేటీవ్‌ కమిటీ విభాగాలనేర్పాటు చేసుకున్నారు. ఇలాంటి బిల్లుల్ని సహజంగా పార్లమెంటులో ప్రవేశపెట్టాక సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తారు. అక్కడ నిపుణుల సహాయంతో లోతుగా పరిశీలించి స్టాండింగ్‌ కమిటీ తన సిఫార్సులు చేస్తుంది. కానీ హజారే కోరుతున్న పద్ధతి ప్రకారం దానికి అవకాశం వుండదు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం కాదా? జన లోక్‌పాల్‌ బిల్లును తయారు చేయడానికి హజారే గారి టీమ్‌ దాదాపు 8 నెలల సమయం తీసుకుంది. 3 ముసాయిదాలు మార్చారు. ఆ మాత్రం సమయం ప్రజలకు పార్లమెంట్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదా? అన్నది ఇక్కడ ప్రశ్న. ఇప్పటివరకు బిల్లు పెట్టకుండా ఆలస్యం చేయడం ఎంత తప్పో విస్తృత చర్చ లేకుండా హడావుడిగా ఆమోదించం కూడా అంతే తప్పవుతుంది. వ్యవస్థీకృతమైన అవినీతిని సంఘటితంగా ఢకొీనాలి. దానికి ప్రజల మద్దతు చాలా కీలకం. అది పౌర సంఘాల ద్వారా జరిగే పని మాత్రమే కాదు, చైతన్యవంతమైన, నిబద్ధత కలిగిన ప్రజాసంఘాలు, మేథావులు, రాజకీయ పార్టీలను కూడా విశ్వాసంలోకి తీసుకొని భాగస్వాములను చేయాలి. అప్పుడే అది కొంతవరకు విజయవంతమవుతుంది. లేకుంటే లోక్‌పాల్‌ మరల గుంటనక్కల పాలవుతుంది.

Friday, April 8, 2011

చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే

చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే

చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే

పూసిందే ఆ పూలమాను నీ దీపంలో
దాగిందే నా పేద గుండె నీ తాపంలో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై
ఉన్నానే ఈనాటికి నేస్తానై
ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాళ్ళకు చేరం
తీరందీ తీరం
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే

తానాలే చేసాను నేను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో సంకళ్ళే
ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే
ఉందా కన్నీళ్ళకు అర్ధం,ఇన్నేళ్ళుగ వ్యర్ధం
చట్టందే రాజ్యం

చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే 
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ..

పల్లవి:

ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది |2|
ఆవేశం ఏనాడు కలిగెనొ
ఆనాడే తెలిసిందది |2|
ఆకాశం.. |2|
చరణం 1
ఏ పువ్వు ఏ మోవిదన్నది
ఏ నాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది
ఏ పొద్దో రాసున్నది
బంధాలై పెన వేయు వయసుకు
ఆందాలే దాసోహమనగ
మందారం విరబూయు పెదవులు
మధువులనే చవి చుడమనగ
పరువాలే ప్రణయాలై
స్వప్నాలే స్వర్గాలై
ఎన్నేన్నో శృంగార లీలలు
కన్నుల్లో రంగేళి అలరెను

చరణం 2
ఏ మేఘం ఏ వాన చినుకై
చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున
ఏ గీతం పలికించునో
హృదయాలే తెర తీసి తనువుల
కలబోసి మరపించమనగ
కౌగిలిలో చెర వేసి మదనుని
కరిగించి గెలిపించ మనగ
మోహాలే దాహాలై
సరసాలే సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు
ఇవ్వాలి వెలలేని విలువలు

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా

నల్లా నల్లని వాడు..నిన్నూ కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చూ
కన్నట్టే గీటేసి పెడతాడె చిచ్చూ (2)
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడే
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడే
దారివ్వకే చుట్టూ తారాడుతాడే

పిల్లా పోనివ్వనంటూ చల్లా తాగేస్తడే
అల్లారల్లరివాడు..అబ్బో ఏం పిల్లడే..

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

శిఖిపింఛమౌళన్న పేరున్నవాడే..
శృంగార రంగాన కడతేరినాడే (2)
రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె
రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె
ఈ రాధకీడైన జతగాడు వాడే

మురళీలోలుడు వాడే..ముద్దూ గోపాలుడే
వలపే దోచేసినాడే..చిలిపీ శ్రీకృష్ణుడూ..

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా

నల్లా నల్లని వాడు..నిన్నూ కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంటా..
చిన్నారి పొన్నారి చిలకల్లా జంటా..
చేస్తున్నా కమ్మని కాపురమూ..
చూస్తున్నా కన్నుల్ల సంబరమూ..
ప్రేమకు మందిరమూ..

||తియ్యన్ని||

ఒక దేహం ఒకప్రాణం తమ స్నేహంగా..
సమభావం సమభాగం తమ పొందుగా..
చిలకమ్మ నెయ్యాలే ఉయ్యాలగా..
చెలికానీ సరసాలే జంపాలగా..
అనురాగం ఆనందం అందాలుగా..
అందాల స్వప్నాలే స్వర్గాలుగా..
ఎడబాసి మనలేని హృదయాలుగా..
ముడిపడ్డ ఆ జంట తొలిసారిగా..
గూడల్లుకోగా పుల్లల్లు తేగా..
చెలికాడు ఎటకో పోగా..
అయ్యో పాపం.. వేచెను చిలకమ్మా..

||తియ్యన్ని||

ఒక వేటగాడెందో వలపన్నగా..
తిరుగాడు రాచిలక గమనించకా..
వలలోనా పడి తాను అల్లాడగా..
చిలకమ్మ చెలికానీ సడికానకా..
కన్నీరు మున్నీరై విలపించగా..
ఇన్నాళ్ళ కలలన్నీ కరిగించగా..
ఎలుగెత్తి ప్రియురాలు రోధించగా..
వినలేని ప్రియుడేమో తపియించగా..
అడివంత నాడు ఆ జంటగోడు..
వినలేక మూగై పోగా...
అయ్యో పాపం.. వేచెను చిలకమ్మా..

||తియ్యన్ని||