Thursday, April 14, 2011

అవినీతిపై పోరాటాన్ని మోడీకరణ చేయొద్దు


ఆదివారం హజారే మీడియానుద్దేశించి మాట్లాడుతూ నరేంద్రమోడీని ఆకాశానికెత్తారు. తద్వారా తనంతట తానుగా ఉద్యమ పరిధిని కుదించుకున్నారు. రాజకీయాలకతీతంగా అవినీతి వ్యతిరేకోద్యమం అన్న ఆయన మాటల చిత్తశుద్ధిని ఇది తేటతెల్లం చేసింది. మోడీని ఆయన ఉత్తమ ముఖ్యమంత్రిగా కొనియాడారు. చట్టం వచ్చి ఎనిమిదేండ్లయినా ఇంతవరకు గుజరాత్‌లో లోకాయుక్తను నియమించలేదు. పైగా ఆ చట్టం పరిధిలోకి ముఖ్యమంత్రి రాడు. అదే సమయంలో బెంగాల్‌ లోకాయుక్త పరిధిలోకి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి చరిత్ర సృష్టించింది. దీన్ని బట్టే హజారే అసలు ఉద్దేశాలేమిటో మనకు బోధపడుతుంది.                        ----------------------వి.శ్రీనివాసరావు (ప్రజాశక్తి సౌజన్యం నుండి)

ప్రభుత్వంతో అవగాహన కుదరడంతో అన్నా హజారే దీక్ష విరమించారు. దేశ వ్యాపితంగా ఆనందోత్సాహాలు వెల్తువెత్తినట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇందులో మీడియా క్రియాశీలపాత్ర వహించింది. దీక్ష విరమించగానే ''భారతదేశం జయించింది'' అన్న బ్యానర్‌లతో వార్తలిచ్చాయి. నిన్న ప్రపంచకప్‌..నేడు హజారేదీక్ష..అన్న చందంగా అభివర్ణించాయి. ప్రపంచకప్‌ను శ్రీలంకమీద గెలుచుకున్నాం కాని దీక్ష ఎవరిపై విజయం? ఇందులో భారతదేశం విజేత అయితే ఓడిందెవరు? అవినీతి ఓడిపోయిందా? లేక ప్రభుత్వం ఓడిపోయిందా? అందరూ నీతిపరులే అయితే అవినీతి ఎక్కడుంది? ప్రాస కోసం వార్తలు, విశ్లేషణలు ఇస్తున్నారనుకున్నా ప్రజలకు వాస్తవం తెలియాలి కదా? ఈ ఉద్యమంలో అత్యంత విషాదకర వార్తలు కూడా ఉన్నాయి. ఎవరినైతే అవినీతిపరులుగా మీడియా ఎత్తి చూపిందో వారే నేడు ఈ ఉద్యమానికి మద్దతునీయడంలో అందరికన్నా ముందున్నారు. ఉదాహరణకు కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంబరాలు జరుపుకున్నారు. పలు భూ కుంభకోణాల్లో ఆరోపణలు నిగ్గు తేలినా ఆయన్ను పదవిలో అట్టిపెట్టిన బిజేపీ అవినీతి వ్యతిరేకపోరాట యోధురాలిగా పోజులిస్తోంది. 2జి కుంభకోణానికి ఆదిమూర్తులు బిజేపీవాళ్లేనని ఇప్పుడు రికార్డులు చెపుతున్నాయి. అరుణ్‌శౌరీ మంత్రిగా ఉండగా ఈ చౌకబేరానికి తెర లేపారు. రాజా ఆ వారసత్వాన్ని అంది పుచ్చుకున్నాడంతే. దీక్షకు సోనియాగాంధీ సంఘీభావం తెలియచేస్తూ హజారేకు ఉత్తరం రాశారు. కాంగ్రెసు, బిజేపీలు రెండూ ఉత్తమ పార్టీలే అయితే దేశంలోని సొమ్మంతా వారికి తెలియకుండానే ఎక్కడికి పోతున్నట్లు? ఐపియల్‌ కుంభకోణంలో పదవి నుండి తొలగించబడ్డ లలిత్‌ మోడీ క్రికెట్‌ అభిమానులంతా హజారే బొమ్మ, బ్యానర్లు పెట్టుకొని స్టేడియంలకు రావాల్సిందిగా పిలుపునిచ్చాడు. బడా పారిశ్రామిక సంస్థలు సిఐఐ, ఆసోచామ్‌, ఫిక్కీ ఈ ఉద్యమానికి భుజం కాశాయి. ఆహా! ఎంత బాగుంది. ఈ విజయంలో వీరందరూ భాగస్వాములే అయితే పరాజితులు ప్రజలేనన్నమాట. అవినీతిపరులు, నీతిపరులు ఇద్దరూ ఒకే వైపు ఉండగలరా?

దీక్ష విరమణానంతరం ఆదివారం హజారే మీడియానుద్దేశించి మాట్లాడుతూ నరేంద్రమోడీని ఆకాశానికెత్తారు. తద్వారా తనంతట తానుగా ఉద్యమ పరిధిని కుదించుకున్నారు. రాజకీయాలకతీతంగా అవినీతి వ్యతిరేకోద్యమం అన్న ఆయన మాటల చిత్తశుద్ధిని ఇది తేటతెల్లం చేసింది. మోడీని ఆయన ఉత్తమ ముఖ్యమంత్రిగా కొనియాడారు. చట్టం వచ్చి ఎనిమిదేండ్లయినా ఇంతవరకు గుజరాత్‌లో లోకాయుక్తను నియమించలేదు. పైగా ఆ చట్టం పరిధిలోకి ముఖ్యమంత్రి రాడు. గుజరాత్‌ ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎంత పెద్దఎత్తున అవినీతిసాగుతుందో స్వయానా మోడీ సోదరుడే మీడియాకు చెప్పారు. ఇక ముస్లిం ఊచకోతలకు మోడీ ట్రేడ్‌మార్క్‌గా మారిపోయిన విషయాన్ని గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అదే మరో వైపు బెంగాల్‌ లోకాయుక్త పరిధిలోకి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి చరిత్ర సృష్టించింది. దీన్ని బట్టే హజారే అసలు ఉద్దేశాలేమిటో మనకు బోధపడుతుంది. ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు ప్రజలు ఓట్లను అమ్ముకుంటున్నారని నిందించారు. ఆయనకు ప్రజలపై విశ్వాసం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. అంతేకాదు ఆయనపై ప్రజలకున్న విశ్వాసాన్ని కూడా వమ్ము చేసే మాటలివి. అంతెందుకు. బిల్లు రూపకల్పనలో పాల్గొనే వ్యక్తుల(హజారే టీం) ఆస్తిపాస్తుల వివరాలను బహిరంగంగా ప్రకటిస్తారా అని విలేకరులు అడగ్గా నీళ్లు నమిలారే తప్ప ఎందుకని అక్కడికక్కడే ముందుకు రాలేకపోయారు? జన లోక్‌పాల్‌ బిల్లు తయారు చేయడంలో కర్నాటక లోకాయుక్త ప్రధానపాత్ర పోషించారు. కాని ఆయన తన స్వంత రాష్ట్రంలో ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలొస్తే కనీసం విచారించలేకపోయారు.

అన్నా హజారేకు వాటర్‌ షెడ్ల నిర్మాతగా పేరుంది. 1995-2004 మధ్యలో మన రాష్ట్రంలో వాటర్‌షెడ్లు పెద్దఎత్తున చేపట్టారు. హజారే మన రాష్ట్రానికి వచ్చి పలు సభల్లో పాల్గొని దాన్ని నీటి విప్లవంగా కొనియాడిపోయారు. కానీ ఏం జరిగింది? వేల కోట్ల రూపాయలు గంగపాలయ్యాయి. మహబూబ్‌నగర్‌, ప్రకాశం, ఆదిలాబాద్‌, విజయనగరం లాంటి జిల్లాలు ఇప్పటికీ కరువు కోరల్లో నలుగుతూనే వున్నాయి. వాటర్‌షెడ్ల పేరుతో ప్రాజెక్టులను విస్మరించారు. నాడు ప్రపంచ బ్యాంకు చెప్పింది ఇదే. కానీ ఉపరితల జలాలను భూగర్భ జలాలుగా మార్చడం ద్వారా నీటిపై హక్కు ప్రైవేటు కంపెనీలకు పోయింది. కోకోకోలా, పెప్సీ లాంటి కంపెనీలు ఈరోజు నీళ్ళను పెద్ద వ్యాపారంగా మార్చివేయగలిగినాయి. ఇప్పుడు వాటర్‌షెడ్లు, రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ గురించి ఎవరూ నోరెత్తడం లేదు. అవినీతి నిర్మూలనా కార్యక్రమం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బ్యాంకు కనుసన్నలలోనే సాగుతున్నది. ఇది సత్ఫలితాల నివ్వకపోయినా ప్రజల కోపాగ్నిని చల్లార్చగలదని వారికి తెలుసు.
మీడియా జన లోక్‌పాల్‌ బిల్లుకోసం ఎందుకంత ఆరాటపడుతున్నది? నిజంగా అవినీతిని అరికట్టవచ్చునని నమ్ముతున్నారా? 90శాతం అరికడతామని హజారే చెపుతున్నారు. అలా అయితే ఇప్పటివరకు ఉన్న చట్టాలు ఎందుకు విఫలమయ్యాయి? నేరస్థులను అరికట్టే చట్టాలు కఠినంగా ఉన్నా నేరం ఎందుకు పెరుగుతూనే ఉంది. అవినీతికి రాజమార్గాలెన్ని వున్నాయో వారికీ తెలుసు. ఈ కొత్త వ్యవస్థపై దృష్టి మళ్ళించడానికి ప్రధాన కారణం ఒకటుంది. గత కొంతకాలంగా ఈ వ్యవస్థకు పట్టుకొమ్మలుగా వుండే వివిధ యంత్రాంగాల నిజ స్వరూపం బట్టబయలవుతోంది. రాజకీయ పార్టీలు, నాయకులు, ఉద్యోగస్తులను పక్కన పెట్టినా ఆఖరికి న్యాయ వ్యవస్థ, మీడియాపై కూడా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. అవినీతి వ్యతిరేక సంస్థలే అవినీతిపరుల పాలయ్యాయి. ఉదాహరణకు తాజా సివిసిగా థామస్‌ నియామకం. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడుకోవాలంటే ప్రజలకు విశ్వాసం కల్పించే మరో కొత్త వ్యవస్థ కావాలి. అదే లోక్‌పాల్‌. దాన్ని అవినీతిని నిర్మూలించే రుద్ర కాళికగా చూపెట్టి ప్రజల్లో ఈ వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నం ఇది. కొంతకాలమైనా ప్రజలలో రగులుతున్న అసంతృప్తిని, ఆగ్రహావేశాలను అదుపు చేయవచ్చు. ఈ తాత్విక ఆలోచనల నుంచే ప్రభుత్వం ఎక్కువ సమయం తీసుకోకుండానే హజారే డిమాండ్లను అంగీకరించి సంయుక్త కమిటీని నియమించింది. తద్వారా తాను కూడా అవినీతి నిర్మూలనకు కట్టుబడి వున్నానని నిరూపించుకునే ప్రయత్నం చేసింది.

అవినీతికి కారణాలపై మీడియాలో జరుగుతున్న చర్చల్ని పరిశీలిస్తే ఏనుగు ఏడుగురు గుడ్డివాళ్ల కథ గుర్తుకొస్తుంది. వ్యక్తుల అత్యాశను కారణంగా కొందరు చెపితే, ఎన్నికల వ్యవస్థను కారణంగా మరికొందరు భావించారు. బ్యూరోక్రసీని కొందరు నిందిస్తే, అధికార కేంద్రీకరణను మరికొందరు ఎత్తిచూపారు. రాజకీయనాయకులను, పార్టీలను కొందరు ఘాటుగా విమర్శించారు. కఠినమైన చట్టాలు లేనందునే అవినీతి ప్రబలుతోందని మరికొందరు వాదిస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన పద్దతిలో వారు విశ్లేషణ చేస్తున్నారు. ఎవరి దృక్కోణం ప్రకారం వారి వాదన సరైందనే అనుకుంటున్నారు. వాదనలన్నీ పాక్షికమైనవే. ఇవన్నీ విడివిడిగా వాస్తవాలైనప్పటికీ సమగ్రమైన విశ్లేషణ మాత్రం కాదు. ఉదాహరణకి బ్యూరోక్రసీ వల్లనే అవినీతి పెరిగిందీ అనుకుంటే గత 20 ఏళ్లలో నూతన ఆర్థిక విధానాల తరువాత బ్యూరోక్రసీ ప్రభావం ప్రభుత్వ యంత్రాంగంపై చాలా తగ్గింది. ఆ లెక్క ప్రకారం అవినీతి తగ్గాలి. కానీ ఈ కాలంలో ఇంకా పెరిగింది. శేషన్‌ ఎన్నికల సంస్కరణలతో అంతా బాగవుతుందనుకున్నారు. కాని ఏమైంది? డబ్బు ప్రభావం తగ్గకపోగా పెరిగింది. డబ్బు పెట్టని వామపక్షాల వంటి పార్టీలకు ప్రచారం చేసుకునే అవకాశం లేకుండా కుదించేశాయీ నిబంధనలు. అలాగే వ్యక్తుల అత్యాశ అని అంటున్నారు. ఆశ అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. చదువుకునే వారికి, వ్యవసాయం చేసేవారికి, ఉద్యోగం చేసేవారికి, కూలి వారికి, పారిశ్రామిక వేత్తకు, రాజకీయ నాయకులకు. ఇలా ఆశ లేనటువంటి వారు లేరు. కానీ ఆశ వున్నా కూలివారు, కార్మికులు వీళ్ళెవరూ కూడా ధనికులు కాలేకపోతున్నారు. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు దొరకడం లేదు. కాబట్టి ఆశవల్లే అవినీతి పెరిగిందంటే ప్రతి ఒక్కరూ అవినీతి పరులే కావాలి ఈ దేశంలో. ఆశ వున్నప్పటికీ కూడా దాన్ని ఆచరణలో పెట్టాలంటే అవకాశాలు కూడా ఉండాలి. అలాంటి అవకాశాలు ఈ వ్యవస్థలో ఎక్కడున్నాయనే విషయం మనం పరిశీలించాలి. అన్నిటికి మూలం కోరికలలో వుందని బుద్ధుడు అన్నాడు. ఆ లెక్క ప్రకారం కోరికలను చంపుకోవాలి. అది సాధ్యమవుతుందా. లేదా మనుషుల మనసులు మార్చడానికి దైవప్రార్థనలు చేయాలి. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇప్పించాలి. మనసును అదుపులో పెట్టుకోవడానికి యోగా చేయాలి. ఈ పనులు చేస్తున్నవారు అవినీతికి అతీతంగా ఉన్నారా? అలా కూడా లేరు. పైగా అవినీతికి ఎక్కువ పాల్పడుతున్నవారే ఇటువంటి పనులు చేస్తున్నారని మన కంటికి కనిపిస్తున్నది. కాబట్టి ఆశ వ్యక్తుల యొక్క లక్షణం కాదు.

దీనికి మూలం మరోచోట ఉంది. నిజానికి ఆశ అనేది పెట్టుబడి లక్షణం. ఈ వ్యవస్థలో తన పెట్టుబడిని పదింతలు చేయడానికి అది అర్రులు చాస్తుంది. లాభం తీసుకురాకుంటే అది ఆ రోజు నిద్రపోనివ్వదు. అది నిద్రపోదు. టీవీ స్క్రీన్‌ మీద క్షణక్షణం మారే షేర్‌ మార్కెట్‌ గ్రాఫ్‌ మనుషుల్ని ఉరకలు పెట్టిస్తుంది. పెట్టుబడి చట్టాలను లెక్కచేయదు. సమాజం పట్ల దానికి దయాదాక్షిణ్యాలు వుండవు. లాభం కోసం ఏ పనికైనా తెగబడుతుంది. హత్యలు, దోపిడీలు చేస్తుంది, జైళ్ళు బద్దలు కొడుతుంది. అలాంటి పెట్టుబడికి స్వేచ్ఛను ఇచ్చి దేశం మీదికి వదిలింది ఎవరు? సంస్కరణలకు ముందు పులిని బోనులో పెట్టి, రోజు కొన్ని జంతువులను ప్రభుత్వమే బలి ఇచ్చేది. దాని ఆకలి తీర్చలేకపోయింది. బలిసిపోయినకొద్దీ ఆకలి పెరుగుతోంది. నువ్వు నా ఆకలిని తీర్చలేవు. నీకెందుకు శ్రమ. నన్ను ఒదిలేసేరు..నా మానాన నేను బతుకుతాను. అని పులి చెప్పడంతో బోనులోంచి ఒదిలేసింది ప్రభుత్వం. దానికే సంస్కరణ అని ముద్దుపేరు పెట్టింది. ఇప్పుడది స్వైర విహారం చేస్తోంది. శనివారం హిందుస్తాన్‌ టైమ్స్‌లో ఇచ్చిన మార్కెట్‌ సర్వే ప్రకారం 40% అవినీతి ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వ పెద్దలను ఆడించడానికే వినియోగిస్తున్నారు. 20% అవినీతి కంపెనీల మధ్య సాగుతోంది. కస్టమర్లను ఆకర్షించడానికి మరో 20% అవినీతి ఖర్చవుతోంది. ఉద్యోగులను అదుపుచేయడానికి, పన్నును ఎగవేయడానికి అవినీతిని ఎరగా వేస్తున్నారు. దేశం వేరులో చేరి పీడిస్తున్న ఫైనాన్స్‌ పెట్టుబడిని అదుపు చేయకుండా అవినీతిని అరికడతాం అంటే అది జనాన్ని మోసం చేయడమే అవుతుంది. లేకపోతే లోక్‌పాల్‌ వంటి చట్టాల ద్వారా మహా అయితే కిందిస్థాయి అవినీతిని కొంతవరకు తగ్గించవచ్చు. లేదంటే పాలకవర్గాల మధ్య ఉండే వైరుధ్యాన్ని పరిష్కరించుకోవడానికి ఉపయోగపడవచ్చు. లోక్‌పాల్‌ వచ్చాక పై స్థాయిలో కొత్త మార్గాలను కనిపెడతారు. ఉదాహరణకు కోటి రూపాయలు క్యాష్‌గా ఇచ్చే బదులు, ఒక కంపెనీ లాటరీలో డ్రా తీసుకొని 4 కోట్ల ఖరీదు కలిగిన ఒక కారును బహుమతిగా అందించవచ్చు. ఒక కంపెనీ పెట్టించి దాని షేర్లను అధిక ధరకు కొని లాభం చేకూర్చవచ్చు. విదేశాల్లో చదివే నాయకుల బిడ్డల ఖర్చులన్నీ విదేశీ కంపెనీ భరించవచ్చు. దాన్ని ఎవరు, ఎలా అరికడతారు? రాజ్యాధికారంతో సహా సర్వాధికారాలు అనుభవిస్తున్న ఫైనాన్స్‌ పెట్టుబడి లీలల నుండి ఎవరైనా తప్పించుకోగలరా?

బిల్లు ఆమోదానికి వారు పడుతున్న ఆరాటం చూస్తుంటే లోక్‌పాల్‌ చట్టాన్ని పటిష్టవంతంగా రూపొందించడం కన్నా తాము తయారు చేసిన బిల్లును ఆమోదింపచేసుకోవాలన్న తపనే ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ కమిటీకి వెలుపల అవినీతి వ్యతిరేక పోరాటంపై ఆసక్తి కలిగిన వ్యక్తులు, శక్తులు, సంస్థలు చాల ఉన్నాయి. ఆ విషయాన్ని వారు ముందు గుర్తించాలి. ఉదాహరణకు ప్రఖ్యాతి గాంచిన న్యాయమూర్తి జస్టిస్‌ వి ఆర్‌ కృష్ణయ్యర్‌ వున్నారు. ప్రముఖ జర్నలిస్టు, మెగసేసె అవార్డు గ్రహీత పి.సాయినాధ్‌ వున్నారు. అవినీతి వ్యతిరేకపోరాటంలో వీరు అలుపెరగని యోధులు. బోఫోర్స్‌ మొదలుకొని తాజా వీకీలీక్స్‌ వరకు హిందూ పత్రిక సాగించిన పోరాటం మనకు తెలుసు. అలాగే తెహల్కా మీడియా ద్వారా అనేక అవినీతి కేసులు వెలుగులోకి వచ్చాయి. 2జిలో రాడియా టేపుల్ని బయటపెట్టింది ఓపెన్‌ అనే మ్యాగజైన్‌. అందరినీ కమిటీలో పెట్టుకోలేకపోయినా కనీసం బిల్లు ముసాయిదా తయారైనాక దాన్ని ప్రజల కోసం బహిరంగపరచాలి. అందరి అభిప్రాయాలూ తీసుకోవాలి. కానీ వీరి తొందరపాటు చూస్తుంటే ఏకబిగిన పార్లమెంటులో పెట్టేసి వెంటనే ఆమోదించాలన్నట్లు వుంది. హజారే పెట్టిన ఆగస్టు 15 గడువు బిల్లుపై విశాల మద్దతును కూడగట్టేందుకు, విస్త ృతంగా చర్చ జరిగేందుకు తోడ్పడదు. బిల్లును ఆమోదించాల్సింది పార్లమెంటు. ఆ పార్లమెంటు సభ్యులు ప్రజలెన్నుకొన్న ప్రతినిధులు. వారిలో అధికార పక్షమే కాదు, ప్రతిపక్షం కూడా వుంది. ప్రతిపక్షంలో బిజెపి లాంటి అభివృద్ధి నిరోధక పార్టీయే కాదు, వామపక్షాల్లాంటి అభ్యుదయ శక్తులు వున్నాయి. అవినీతిపరులే కాదు, నీతి నిబద్ధత కలిగిన వ్యక్తులూ వున్నారు. వారు దానిని అధ్యయనం చేసి క్లాజుల వారీగా తమ అభిప్రాయం చెప్పాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం బిల్లు పెట్టగానే చేతులెత్తేసి, బల్లలు చరిచి ఆమోదించే పద్ధతి మంచిది కాదని సెలెక్ట్‌ కమిటీ, స్టాండింగ్‌ కమిటీ, కన్సల్టేటీవ్‌ కమిటీ విభాగాలనేర్పాటు చేసుకున్నారు. ఇలాంటి బిల్లుల్ని సహజంగా పార్లమెంటులో ప్రవేశపెట్టాక సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తారు. అక్కడ నిపుణుల సహాయంతో లోతుగా పరిశీలించి స్టాండింగ్‌ కమిటీ తన సిఫార్సులు చేస్తుంది. కానీ హజారే కోరుతున్న పద్ధతి ప్రకారం దానికి అవకాశం వుండదు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం కాదా? జన లోక్‌పాల్‌ బిల్లును తయారు చేయడానికి హజారే గారి టీమ్‌ దాదాపు 8 నెలల సమయం తీసుకుంది. 3 ముసాయిదాలు మార్చారు. ఆ మాత్రం సమయం ప్రజలకు పార్లమెంట్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదా? అన్నది ఇక్కడ ప్రశ్న. ఇప్పటివరకు బిల్లు పెట్టకుండా ఆలస్యం చేయడం ఎంత తప్పో విస్తృత చర్చ లేకుండా హడావుడిగా ఆమోదించం కూడా అంతే తప్పవుతుంది. వ్యవస్థీకృతమైన అవినీతిని సంఘటితంగా ఢకొీనాలి. దానికి ప్రజల మద్దతు చాలా కీలకం. అది పౌర సంఘాల ద్వారా జరిగే పని మాత్రమే కాదు, చైతన్యవంతమైన, నిబద్ధత కలిగిన ప్రజాసంఘాలు, మేథావులు, రాజకీయ పార్టీలను కూడా విశ్వాసంలోకి తీసుకొని భాగస్వాములను చేయాలి. అప్పుడే అది కొంతవరకు విజయవంతమవుతుంది. లేకుంటే లోక్‌పాల్‌ మరల గుంటనక్కల పాలవుతుంది.

2 comments:

  1. అన్నా నిభద్దత గల వ్యక్తిగా వ్యవహరిచలేదు. రాజకేయాలకు వ్యతిరేఖంగా మాట్లాడటం నీచమైన రాజకీయంగా భావించవచ్చు. శ్రీనివాసరావు గారి వ్యాసం ఆలోచింపచేసింది.

    ReplyDelete
  2. శ్రీనివాసరావు గారి వ్యాసం బావుంది

    ReplyDelete