Thursday, April 14, 2011

మోడీపై పొగడ్తలా?

- తీవ్ర విస్మయానికి గురయ్యాను: సారాబాయి - నిరసనగా అన్నాహజారేకు లేఖ

అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన అన్నా హజారే గుజరాత్‌ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రశంసిస్తూ ఇటీవల విడుదల చేసిన ప్రకటనపై ప్రముఖ కళాకారిణి, సామాజిక కార్యకర్త మల్లికా సారాబాయి తీవ్ర విస్మయానికి గురయినట్లు పేర్కొన్నారు. అన్నా హజారే దీక్షకు మద్దతుగా అహ్మదాబాద్‌లో ఆందోళనలో పాల్గొన్న మల్లికా సారాబాయి మోడీని పొగడటంపై హజారేకు నిరసన తెలుపుతూ లేఖ రాశారు. గుజరాత్‌ గ్రామాల్లో కొద్దిపాటి అభివృద్ధి కూడా జరగలేదన్నారు. 'మీ పొగడ్తను ఉపసంహరించుకోకపోతే లోక్‌పాల్‌ ఉద్యమానికి మాకు మేము దూరంగా ఉండాల్సి వస్తుంది' ఆమె లేఖలో పేర్కొన్నారు. తన ప్రశంస కేవలం గ్రామీణాభివృద్ధికి సంబంధించి మాత్రమేనని హజారే సారాభాయికి లేఖ రాశారు. 'నరేంద్ర మోడీ నితీష్‌కుమార్‌ గ్రామీణ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి పనులను మాత్రమే నేను ప్రశంసించాను. అదే సమయంలో మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా నేను వ్యతిరేకిస్తాను' అని హజారే సారాబాయికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
తీవ్రంగా బాధపడ్డాం: సామాజిక కార్యకర్తలు
అన్నా హజారే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించినందుకు తీవ్రంగా బాధ పడ్డామని పలువురు సామాజిక కార్యకర్తలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులు, మహిళలు, కార్మికులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, అన్ని అణగారిన వర్గాలకు వ్యతిరేకమైనదని స్పష్టం చేశారు. ఈ మేరకు పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జెఎస్‌ బందుక్వాలా, మానవ హక్కుల సంస్థ డైరెక్టర్‌ ప్రశాంత్‌, ఫాదర్‌ సెడ్రిక్‌ ప్రకాశ్‌, నేషనల్‌ ఫెలో ఆఫ్‌ ది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ (సిమ్లా)కి చెందిన ఘన్‌శ్యాం షా, సామాజిక కార్యకర్తలు రోహిత్‌ ప్రజాపతి, తృప్తి షా, నందిని మంజ్రేకర్‌ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 'ఇండియా అగైన్‌స్ట్‌ కరప్షన్‌' గుజరాత్‌ కన్వీనర్‌ వినోద్‌ పాండ్యా సహా అనేకమంది అన్నా హజారేకు వాస్తవ పరిస్థితి తెలియదని అభిప్రాయపడ్డారు. ఆయన స్వయంగా గుజరాత్‌కు వచ్చి పరిస్థితిని చూడాలన్నారు.ల

లేఖ పూర్తి పాఠం
డియర్‌ అన్నాజీ !
నరేంద్ర మోడీ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధిపై మీరు ప్రశంసలు కురిపించడం మమ్మల్ని తీవ్ర విస్మయానికి గురిచేసింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిపాటి అభివృద్ధి కూడా జరగలేదు. వాస్తవమేమిటంటే సేద్యపు భూములను కూడా రహస్యంగా ప్రభుత్వం తీసుకొని అతి తక్కువ ధరలకు పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టింది. 21 లక్షల మంది రైతులు నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు ఏడేళ్ళ నుండి ఇక్కడ లోకాయుక్తా లేకపోవడంతో అవినీతికి వ్యతిరేకంగా దాఖలైన వందలాది ఫిర్యాదులపై విచారణ నిలిచిపోయింది. సుజలాం సుఫలాం పథకంలో రూ. 1,700 కోట్లు, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌లో 109 కోట్ల కుంభకోణం, మత్స్యశాఖలో 600 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నాయి. ప్రతి శాఖ వేలాది కోట్ల రూపాయల కుంభకోణంలో కూరుకుపోయి ఉంది. మోడీ తన స్నేహితులైన పారిశ్రామికవేత్తలకు పేద, గ్రామీణ ప్రాంత ప్రజలను అమ్మేశారు. పరిశ్రమలపై చూపిన ఉదాసీన వైఖరివల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. మీ పొగడ్త భయంకరమైనది. దీనిని మీరు ఉపసంహరించుకోకపోతే లోక్‌పాల్‌ ఉద్యమానికి మేము బలవంతంగానైనా దూరంగా ఉండాల్సి వస్తుంది'
ఇట్లు
మల్లికా సారాబాయి

No comments:

Post a Comment