నీ ప్రశ్నలు నీవే…
ఇది సౌమ్యశ్రీ రచన
ఈ టపా రాయకూడదు అని చాలా ట్రై చేసా – ఎందుకంటే చెప్పలేను. మరీ పెస్సిమిస్టిగ్గా అనిపిస్తుందని నా అనుమానం అని నేననుకుంటున్నాను. అయినా, ఆ పదాలలా ఉంటే నేనేం చేస్తాను గానీ, అది మరీ నన్నలా పడుకున్నా లేచినా నిల్చున్నా, కూర్చున్నా వెంటాడుతూ ఉంటే – ఇక రాయకుండా ఉండలేకపోతున్నా. ఆ టైటిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా, దేని గురించి మాట్లాడుతున్నానో – “కొత్త బంగారు లోకం” సినిమాలోని “నీ ప్రశ్నలు నీవే…ఎవ్వరో బదులివ్వరుగా..” పాట గురించి.
నేను సినిమా చూడలేదు కనుక ఆ పాట ఎప్పుడొస్తుందో, ఎందుకొస్తుందో నాకు తెలీదు. కానీ, ఆ పాట ఎప్పుడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా ఎంతో విలువైన మాటలు చెబుతుందని నాకు అనిపిస్తుంది. నెలరోజులుగా దాదాపు ప్రతి రోజూ ఒకసారైనా ఈ పాట వింటున్నా. విన్న ప్రతిసారీ రకరకాల భావాలు కలుగుతున్నాయి – ఒకసారి అసహాయత పై అసహ్యం, ఒకసారి ఆశ చిగురించడం, ఓ సారి నవ్వు రావడం, ఓ సారి కళ్ళలో నీరు తిరగడం, ఓ సారి కోపం – ఇలా నేను రకరకాల ఉద్వేగాలకు లోనయ్యాను వివిధ సందర్భాల్లో ఈ పాట ద్వారా.” నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా”
-ఔను నిజం ఔను నిజం నీవన్నది నిజం నిజం! నిజం నిజం!
ఈ రెండు లైన్లు మాత్రం, Ultimately, నీ తంటాలేవో నువ్వు పడాల్సిందే, అని నాకు నేను చెప్పుకున్న ప్రతిసారీ గుర్తొస్తాయి …
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
-నాకు నవ్వు వచ్చేది ఇక్కడే. ఎలా ఉంటుందంటే, బాగా అనుభవంలో తలపండిన మనిషి, కొత్తగా వచ్చినవాడికి “సూక్ష్మం గ్రహించు నాయనా!” అని చెబుతున్నట్లు ఉంటుంది నాకు. గ్రహించామా? గ్రహిస్తామా? అన్నది పక్కన పెడితే, నా కళ్ళ ముందు ఓ బ్రహ్మానందం తరహా పాత్ర ప్రత్యక్షమై, ఆ తరహా వ్యంగ్యం వినిపిస్తుంది నా చెవులకి.
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
-ఫిలో ఫిలో…. ఇలా మొదలుపెట్టామంటే, ఇక ఐనట్లే. ప్రతీదీ ఇలాగే చెప్పుకుంటూ పోవచ్చు
“బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా”
-అని అంటూ ఉంటే, ధైర్యం చెప్పడానికి నేపథ్యం తయారు చేసుకుంటున్నారేమో అనుకుంటే,
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
-అని ఇంకా భయపెట్టేస్తారు. ఇదంతా నాకు రాత్రి ఆఫీసు నుంచి వస్తూ, ట్రాఫిక్ జాంలలో ఇరుక్కున్న ఏడుపుగొట్టు బస్సులో ఊసురోమని కూర్చుని వింటున్నప్పుడు పరమ పెస్సిమిస్టిగ్గా అనిపిస్తుంది. అయినా రిపీట్ కొట్టీ మరీ ఈ పాటనూ, బ్యాక్ బ్యాక్ కొట్టి ఈ లైన్లనూ మళ్ళీ మళ్ళీ వింటాను. ఎందుకంటే ఏం చెప్పను? అదంతే!
“అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా”
- Hmm… అనుకుంటూ ఎన్నిసార్లు విన్నానో ఈ వాక్యాలని. కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా….. అన్నప్పుడల్లా నేను జవాబు కోసం వెదుక్కుంటూనే ఉంటాను..ఉన్నాను.
గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
- ఈ రెండో లైన్ కూడా… దూరం గమ్యం ..ఏదీ తెలీని దారుల్లో నడుస్తున్న ప్రతి రాత్రీ గుర్తొస్తుంది..గుర్తొచ్చి…ఆ వాక్యానికి ప్రాణమొచ్చి నా ఎదుట నిలబడి నిలదీస్తున్నట్లు అనిపిస్తుంది.
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది
సుడిలోపడు ప్రతి నావ చెపుతున్నది వినలేవా”
- నిజమే… ఏది గెలుపు? ఎవరిది గెలుపు? రిలేటివ్ గా చెప్పగలమే కానీ, “ఇదే గెలుపు” అని చెప్పగలమా?
పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా
- ఒక్కసారి తప్పు చేస్తే, ఒక్కోసారి సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. ఆ తప్పుల చీకట్లో పడి మగ్గడం తప్ప. సూటిగా తగుల్తూ ఉంటుంది ఈ భాగం నన్ను. తగిలిన ప్రతిసారి చల్లగా భయపెడుతూ ఉంటుంది కూడా….
మనకోసమే తనలో తను రగిలే రవితపనంతా
కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెపుతుందా
- కోల్పోతే గానీ దేని విలువా తెలీదేమో! ఒక్కోసారి కోల్పోయినవి తిరిగి పొందొచ్చు. ఒక్కోసారి, సరిదిద్దుకోలేని తప్పులు చేసినప్పుడు – ఇలాంటి వాక్యాలు చదువుకుని సాంత్వన పొందాల్సిందే ఏమో!
మొత్తానికి… జీవితంలోని చేదునిజాలని జీర్ణం చేసుకోలేకపోయినా…సగం వరకూ అయినా అంగీకరించడానికి నాకీపాట ఎంతో దోహదపడింది అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే….
No comments:
Post a Comment